Girish Karnad: దిగ్గజ నటుడు గిరీష్ కర్నాడ్ కన్నుమూత
- 81 సంవత్సరాల వయసులో అనారోగ్యం
- బెంగళూరులో ఉదయం 6.30 గంటలకు మృతి
- దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన దక్షిణాది సినీ పరిశ్రమ ప్రముఖులు
ప్రముఖ దక్షిణాది నటుడు గిరీశ్ కర్నాడ్ ఈ ఉదయం బెంగళూరులో కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. మహారాష్ట్రలోని మాతేరన్ లో 1938 మే 19న జన్మించిన గిరీశ్ కర్నాడ్, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, బెంగళూరులో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించి ఈ ఉదయం 6.30 గంటల సమయంలో మృతిచెందారు. 1998లో జ్ఞానపీఠ్ అవార్డుతో పాటు ఎన్నో అవార్డులను ఆయన అందుకున్నారు. చివరిగా ఆయన సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ జిందా హై' చిత్రంలో రా చీఫ్ గా నటించారు. గిరీశ్ కర్నాడ్ మృతిపై దక్షిణాది చిత్ర పరిశ్రమలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. పలువురు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు.
కాగా, తెలుగులో గిరీశ్ కర్నాడ్ ధర్మచక్రం, శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్, ప్రేమికుడు, ఆనంద భైరవి, రక్షకుడు తదితర చిత్రాల్లో నటించారు. 1972లో గిరీశ్ కర్నాడ్ కు బీవీ కారంత్ తో కలిపి 'వంశ వృక్ష' అనే కన్నడ చిత్రానికి ఉత్తమ దర్శకునిగా జాతీయ అవార్డు లభించింది.