Madhya Pradesh: యూపీ, మధ్యప్రదేశ్‌లలో ఆగని కామాంధుల ఆగడాలు
- ఉత్తరప్రదేశ్‌లో మూడు, మధ్యప్రదేశ్‌లో రెండు ఘటనలు
- బాధితులందరూ చిన్నారులే
- దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో కామాంధుల ఆగడాలకు తెరపడడం లేదు. అమ్మాయిలు కనిపిస్తే చాలు దారుణాలకు తెగబడుతున్నారు. గత వారం రోజుల్లోనే ఏకంగా ఐదుగురు బాలికలపై అత్యాచారాలు జరగడం తీవ్రతకు అద్దం పడుతోంది. ఇందులో మూడు ఘటనలు ఉత్తరప్రదేశ్‌లో జరగ్గా, రెండు మధ్యప్రదేశ్‌లో జరిగాయి.
అలీగఢ్‌లోని తప్పాల్ గ్రామంలో మూడేళ్ల చిన్నారిపై జరిగిన ఘటనతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్ జిల్లాలో 12 ఏళ్ల బాలికపై ఆరుగురు యువకులు అత్యాచారానికి పాల్పడగా, కాన్పూరులోని మదర్సాలో 15 ఏళ్ల బాలికపై ఓ ఉపాధ్యాయుడు దారుణానికి పాల్పడ్డాడు. జలౌన్ జిల్లాలోని బిజ్బా గ్రామంలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన దుండగులు అనంతరం హతమార్చి చెట్ల పొదల్లో పడేశారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని మురికివాడకు చెందిన 10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపేశారు. జబల్పూర్ జిల్లాలో నాలుగేళ్ల బాలిక 16 ఏళ్ల బాలుడి చేతిలో అఘాయిత్యానికి గురైంది. యూపీ, మధ్యప్రదేశ్‌లలో జరుగుతున్న వరుస ఘటనలపై సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వాల తీరుపై విరుచుకుపడుతున్నారు.