Visakhapatnam District: నేను పోటీ చేయనన్నాను...చంద్రబాబే బలవంతం చేశారు: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు షాకింగ్ కామెంట్స్
- మళ్లీ టీడీపీకి అధికారంలోకి వచ్చే వరకు విశ్రమించను
- వైసీపీ దాడులకు పాల్పడితే ఐక్యంగా ఎదుర్కోండి
- ఈవీఎంల ట్యాంపరింగ్ జరగడం వల్లే ఓడిపోయాం
విశాఖ జిల్లాలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తనకు పోటీ చేయడం ఇష్టం లేదని, పార్టీ అధినేత చంద్రబాబు బలవంతం వల్లే పోటీ చేశానని చెప్పుకొచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నర్సీపట్నం నియోజకవర్గం నుంచి పోటీచేసి అయ్యన్నపాత్రుడు ఓడిపోయిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అనకాపల్లిలోని కొణతాల రామకృష్ణ కల్యాణ మండపంలో జరిగిన నియోజక వర్గం పార్టీ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని వేదాంతధోరణిలో మాట్లాడారు. తొమ్మిది సార్లు పోటీ చేసిన తనను ఓటర్లు మూడుసార్లు ఓడించారన్నారు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ లాంటి వారికే ఓటమి తప్పలేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలైనా ప్రజలు మార్పుకోరుకున్నారని తెలిపారు. ప్రస్తుతం తాను ఓటమి గురించి ఆలోచించడం లేదని, మళ్లీ టీడీపీని అధికారంలోకి తెచ్చే వరకు విశ్రమించనన్నారు.
గెలిస్తే పింఛన్ మొత్తం రూ.3 వేలు చేస్తానన్న జగన్ మాటతప్పి రూ.250లు మాత్రమే పెంచారన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు ఇస్తానన్న ముఖ్యమంత్రి త్వరలో బడులు ప్రారంభమవుతున్నందున ఆ డబ్బు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని కోరారు. రైతులకు రూ.15 వేల సాయం అందించేందుకు టీడీపీ ప్రభుత్వం జీవో జారీ చేయగా, జగన్‌మోహన్‌రెడ్డి రూ.12,500 మాత్రమే ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
ఆరు నెలల వరకు మనమేమీ మాట్లాడవద్దని, వైసీపీ ప్రభుత్వం పాలన బాగుంటే అభినందించాలని, లేకుంటే ప్రజలే చూసుకుంటారని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని కోరారు. అధికారంలోకి రాగానే వైసీపీ శ్రేణులు రెచ్చిపోయి దాడులు, ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసానికి పాల్పడుతున్నాయని, దీన్ని ఐక్యంగా ఎదుర్కొందామని స్పష్టం చేశారు.