Road Accident: జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. పదకొండు మంది మృతి
- 26 మందికి గాయాలు...పలువురికి తీవ్రగాయాలు
- పలువురి పరిస్థితి ఆందోళనకరం
- ఆగివున్న లారీని ఢీకొట్టిన బస్సు
ఆగివున్న లారీని బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో బస్సు డ్రైవర్ మహ్మద్ సహా మొత్తం పదకొండు మంది దుర్మరణం చెందగా 26 మంది గాయపడ్డారు. వీరిలో చాలామంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. జార్ఖండ్ రాష్ట్రం హజారీబాగ్ చాపహరణ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
బాధితులంతా బీహార్ వాసులని గుర్తించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈరోజు తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలావున్నాయి. రాష్ట్రంలోని ధనువాఘాట్లో ఇనుప చువ్వలతో వెళ్తున్న ఓ లారీ మరమ్మతులకు గురై ఆగిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి పర్యాటకులతో వస్తున్న ఓ బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో లారీని వెనుక నుంచి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇనుప చువ్వలు బస్సులో నుంచి దూసుకువచ్చి ప్రయాణికుల ప్రాణాలు తీశాయి. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా మృతులు, క్షతగాత్రులు చాలామంది బస్సులోనే చిక్కుకుపోయారు. ఇప్పటి వరకు 9 మృతదేహాలను బయటకు తీశారు. బస్సును అతివేగంగా నడిపిస్తుండడం వల్ల డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడని, అదే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. కాగా, గడచిన నాలుగు నెలల కాలంలో ఇదే ప్రాంతంలో పలు ప్రమాదాలు జరగగా 30 మంది మృత్యువాత పడ్డారు.