Amit Shah: త్వరలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరుగా కొత్త గవర్నర్లు?
- అమిత్ షాతో నరసింహన్ భేటీ
- ప్రత్యేక గవర్నర్ల అంశంపై రెండుగంటల పాటు సుదీర్ఘ చర్చ
- త్వరలోనే తెలుగు రాష్ట్రాల సమస్యలు పరిష్కారమవుతాయన్న నరసింహన్
రాష్ట్ర విభజన జరిగినప్పటినుంచి తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ, ఏపీ కార్యక్రమాలకు హాజరయ్యే క్రమంలో ఆయన హైదరాబాద్, అమరావతి మధ్య నిత్య సంచారి అయ్యారు. ఇకపై ఆయనకు ఆ శ్రమ ఉండకపోవచ్చు! త్వరలోనే తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా గవర్నర్లను నియమించాలని కేంద్రం తలపోస్తోంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను తనవద్దకు పిలిపించుకున్నారు.
రెండు గంటలపాటు జరిగిన సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేకంగా గవర్నర్ల నియామకంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. అయితే, ఓ తెలుగు రాష్ట్రానికి గవర్నర్ గా నరసింహనే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఏపీనా, తెలంగాణనా అనేదానిపై స్పష్టతలేదు. అమిత్ షాతో భేటీ అనంతరం నరసింహన్ మాట్లాడుతూ, త్వరలోనే తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు పూర్తిస్థాయిలో సమసిపోతాయని చెప్పారు. భవనాల కేటాయింపు సమస్యలాగా ఇతర సమస్యలు కూడా ఓ కొలిక్కివస్తాయని అన్నారు.