teja: 'జయం' సినిమా విడుదలైన తరువాత సైకిల్ కొనుక్కున్నాను: దర్శకుడు తేజ
- సినిమా ఆఫీసులో పనిచేసేవాడిని
- పది కిలోమీటర్లు నడిచేవాడిని
- రోజుకి 5 రూపాయలు ఇచ్చేవారు
జీవితంలో ఎవరి సహాయ సహకారాలు లేకుండా ఎదగడం .. ఒంటరి పోరాటంలో విజయం సాధించడం అంత తేలికైన పనికాదు. ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికీ అలాంటి విజయం వైపు ప్రయాణించిన వ్యక్తిగా దర్శకుడు తేజ కనిపిస్తారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "నా చిన్నప్పుడు మా నాన్నకి తెలిసిన వ్యక్తి నన్ను ఓ సినిమా ఆఫీసులో పెట్టించాడు. అక్కడి వాళ్లు చెప్పిన పనులన్నీ చేస్తే, రోజుకి 5 రూపాయలు ఇచ్చేవారు. కాకపోతే అక్కడికి వెళ్లడం కోసం రోజూ 10 కిలోమీటర్లు నడిచేవాడిని. జీవితంలో ఎప్పటికైనా సైకిల్ కొనుక్కోవాలని ఆ సమయంలో అనిపించేది. ఆ తరువాత కార్లు కొనుకున్నప్పటికీ సైకిల్ పై ఆశ అలాగే ఉండిపోయింది. అందువల్లనే 'జయం' సినిమా విడుదలైన తరువాత సైకిల్ కొనుక్కుని ఆ ముచ్చట తీర్చుకున్నాను" అని చెప్పుకొచ్చారు.