Monsoon: ఈ నెల 12న రాయలసీమలోకి నైరుతి రుతుపవనాలు
- 13, 14 తేదీల్లో కోస్తా ప్రాంతాలను తాకే అవకాశం
- 15 నుంచి 20 శాతం తక్కువ వర్షపాతం
- ఉత్తరాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో తక్కువగా వర్షాలు
భారతదేశంలో అధికశాతం వర్షం నైరుతి రుతుపవనాల ద్వారానే కురుస్తుంది. అయితే ఈసారి నైరుతి రుతుపవనాలు ఆలస్యం అయ్యాయి. ఎప్పుడూ జూన్ మొదటికల్లా కేరళను తాకి ఆపై కొన్నిరోజుల్లోనే దేశమంతా విస్తరించేవి. ఈసారి అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడడంతో నైరుతి రుతుపవనాల్లో కదలిక మందగించినట్టు ఆంధ్రా యూనివర్శిటీ వాతావరణ విభాగం పేర్కొంది.
ఈ నెల 12న రాయలసీమలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని, ఈ నెల 13, 14 తేదీల్లో కోస్తా ప్రాంతాలను తాకుతాయని తెలిపింది. ఆ తర్వాత ఈ నెల 15, 16 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తాయని వివరించింది. ఈసారి 15 నుంచి 20 శాతం తక్కువగా వర్షపాతం నమోదవుతుందని ఏయూ వాతావరణ విభాగం నిపుణులు అంచనా వేశారు. ఎప్పుడూ నైరుతి రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు పడే ఉత్తరాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఈసారి తక్కువ వర్షాలు పడతాయని వివరించారు.