Andhra Pradesh: మంత్రులు ఎవరైనా అవినీతికి పాల్పడితే తొలగిస్తామని సీఎం జగన్ హెచ్చరించారు: మంత్రి పేర్ని నాని
- జనవరి 26 నుంచి అమ్మ ఒడి పథకం అమలు చేస్తాం
- ఉగాది రోజున పేద మహిళలకు ఇళ్ల స్థలాల పంపిణి
- విడతల వారీగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ
మంత్రులు ఎవరైనా అవినీతికి పాల్పడితే తక్షణం విచారణ చేసి, అది నిజమని తేలితే వారిని తొలగిస్తామని ఏపీ సీఎం జగన్ హెచ్చరించారని మంత్రి పేర్ని నాని అన్నారు. ఏపీ కేబినెట్ తొలి భేటీ ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి శాఖలోనూ అవినీతి జరగకుండా మంత్రులు బాధ్యతలు తీసుకోవాలని, మంత్రులు తమ శాఖలపై పట్టు సాధించాలని జగన్ సూచించారని చెప్పారు. ఈ ప్రభుత్వం రైతు ముఖ చిత్ర ప్రభుత్వంగా ఉండాలని అన్నారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మండలి ఆమోదించిన పలు నిర్ణయాలను ఆయన వివరించారు.
వచ్చే ఏడాది జనవరి 26 నుంచి అమ్మ ఒడి పథకం అమలు చేస్తామని, కాంట్రాక్టు ఉద్యోగులను విడతల వారీగా క్రమబద్ధీకరిస్తామని, ఉగాది రోజున పేద మహిళలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని, సీపీఎస్ రద్దుకు సూత్రప్రాయంగా మంత్రి మండలి నిర్ణయం తీసుకుందని, దీనిపై ఆర్థిక మంత్రి నేతృత్వంలో ఓ కమిటీ వేయాలని, పారిశుద్ధ్య కార్మికులకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని, సెర్ఫ్, మెప్మాలోని పొదుపు మహిళా సంఘాలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని, ఇంకా తదితర అంశాలపై మంత్రి మండలి నిర్ణయించినట్టు చెప్పారు.