West Bengal: బెంగాల్ లో పరిస్థితులు ఇంకా దిగజారితే రాష్ట్రపతి పాలన తప్పదు: గవర్నర్
- కేంద్రానికి నివేదిక అందించిన పశ్చిమ బెంగాల్ గవర్నర్
- ఇప్పటివరకు 12 మంది చనిపోయారన్న త్రిపాఠి
- టీఎంసీ, బీజేపీ పరస్పర విమర్శలు మానుకోవాలంటూ హితవు
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా పశ్చిమ బెంగాల్ లో పరిస్థితులు మారలేదు. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) శ్రేణులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య నిత్యం ఎక్కడో ఒక చోట ఘర్షణలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. శనివారం జరిగిన హింసలో నలుగురు మృతి చెందినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర హోంశాఖ ఆరా తీస్తోంది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి రాష్ట్ర పరిస్థితులపై కేంద్రానికి నివేదిక అందించారు.
దీనిపై త్రిపాఠి మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ లో పరిస్థితి మరీ దిగజారితే రాష్ట్రపతి పాలన విధించక తప్పదని స్పష్టం చేశారు. ఎన్నికల అనంతర హింసాత్మక సంఘటనల్లో ఇప్పటివరకు 12 మంది మరణించారని, అల్లర్లు మరింత పెచ్చరిల్లితే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. అయితే, రాష్ట్రపతి పాలనపై తాను ప్రధానికి గానీ, కేంద్ర హోంమంత్రికి గానీ ఎలాంటి ప్రతిపాదన చేయలేదని త్రిపాఠి వెల్లడించారు.
బెంగాల్ లో హింసకు మీరంటే మీరు కారణం అని టీఎంసీ, బీజేపీ పరస్పరం ఆరోపణలు చేసుకోవడం పట్ల త్రిపాఠి అసహనం వ్యక్తం చేశారు. ఒకరిపై ఒకరు వేలెత్తి చూపించుకునే బదులు సామరస్యపూర్వక వాతావరణంలో శాంతిభద్రతలు నెలకొనేందుకు కృషి చేయాలని హితవు పలికారు.