South Afrika: అయ్యో పాపం దక్షిణాఫ్రికా... మరోసారి వెంటాడిన దురదృష్టం!
- నాలుగు మ్యాచ్ లాడి ఒకే పాయింట్
- వెస్టిండీస్ తో పోటీని అడ్డుకున్న వరుణుడు
- సెమీస్ అవకాశాలు దాదాపు లేనట్టే!
వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు, దక్షిణాఫ్రికా జట్టు అంటే గుర్తొచ్చేది దురదృష్టమే. ప్రపంచస్థాయి క్రీడాకారులున్నా, ప్రత్యర్థి ఎలాంటివాడైనా దెబ్బకొట్టే సత్తా ఉన్నా, పోటీలకు వచ్చేసరికి ఆ జట్టును ప్రతిసారీ దురదృష్టమే వరిస్తుంది. అది డక్వర్త్ లూయిస్ రూట్ లోగానీ, వాన రూపంలోగానీ, అంపైర్ల తప్పిదాల వల్లగానీ... ఇప్పటివరకూ ఆ జట్టు ఒక్కసారి కూడా వరల్డ్ కప్ ను ముద్దాడలేదు. ఇక తాజాగా బ్రిటన్ అండ్ వేల్స్ లో జరుగుతున్న పోటీల్లో సైతం ఆ జట్టు అదే దారిలో నడుస్తోంది.
ఇప్పటికే మూడు మ్యాచ్ లు ఆడి మూడింటిలోనూ ఓడిపోయిన ఆ జట్టు, నిన్న ఎలాగైనా గెలవాలన్న కసితో వెస్టిండీస్ మీద పోటీకి దిగగా, వరుణుడు అడ్డుకున్నాడు. మ్యాచ్ లో 8వ ఓవర్ జరుగుతుండగా, వరుణుడు విరుచుకుపడ్డాడు. ఆపై మరొక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. వర్షం వస్తూ, పోతూ ఉండటంతో, రాత్రి 9. 30 గంటల తరువాత (భారత కాలమానం) పిచ్ ను మరోసారి పరిశీలించిన అంపైర్లు, ఇక మ్యాచ్ జరిగే పరిస్థితి లేదని తేల్చారు.
దీంతో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లకు చెరో పాయింట్ వచ్చాయి. దీంతో నాలుగు మ్యాచ్ లు ఆడి మూడు ఓటములు, ఒక డ్రాతో, దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచి, సెమీస్ ఆశలను దాదాపు వదిలేసుకుంది. ఇక ఏదైనా అద్భుతం జరిగి ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి జట్లు తామాడే 9 మ్యాచ్ లలో నాలుగేసి ఓడిపోవడం జరిగితేనే దక్షిణాఫ్రికాకు అవకాశాలు ఉంటాయి. లేదంటే, రెండు జట్లు వీర విజృంభణ చేసి, మిగతా రెండు జట్లూ పేలవమైన ప్రదర్శన చేయాలి.
అప్పుడు కూడా దక్షిణాఫ్రికాకు సెమీస్ స్థానం అంత సులువేమీ కాదు. సఫారీలు ఇకపై ఆడే అన్ని మ్యాచ్ లలోనూ విజయం సాధించాలి. మెరుగైన రన్ రేట్ నూ మిగుల్చుకోవాలి. ఈ పరిస్థితిలో ఏ విధంగా చూసినా దక్షిణాఫ్రికా సెమీస్ రేస్ నుంచి తప్పుకున్నట్టేనని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు.