Rains: తెలుగు రాష్ట్రాలకు నైరుతి మరింత ఆలస్యం... కారణమిదే!
- కురవని తొలకరి, రైతుల్లో ఆందోళన
- మరో వారమైతేనే వర్షాలు
- పాక్ వైపు వెళుతున్న వాయుగుండం
మృగశిర కార్తె వస్తే, వర్షాలు వచ్చేస్తాయి. తొలకరి జల్లులు కురిసి, రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతారు. కానీ, ఈ సంవత్సరం మృగశిర వచ్చి వారం రోజులు అవుతున్నా నైరుతి రుతుపవనాల జాడలేదు. జూన్ 1న కేరళను తాకాల్సిన రుతు పవనాలు జూన్ 8న ప్రవేశించాయి. దీంతో కనీసం 12, 13 తేదీల నాటికి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలపై విస్తరిస్తాయని భావించారు. కానీ, ఈలోగా అరేబియా సముద్రంపై అల్పపీడనం ఏర్పడింది. అది నైరుతి రుతుపవనాలను తనవైపు లాగేసుకుంది. ఫలితంగా పశ్చిమ కర్ణాటక, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, కేరళవాసులు తడిసిముద్దవుతున్నారు. తమిళనాడులో సైతం, కేరళ సరిహద్దు ప్రాంతాల్లో తప్పమిగతా ప్రాంతాల్లో వర్షాలు లేవు. రాయలసీమ సంగతి సరేసరి.
ఇదిలావుండగా, అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి, పాకిస్థాన్ వైపు కదులుతుండగా, దీంతో నైరుతి మరింత ఆలస్యంగా తెలంగాణలోకి రానుందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఈ నెల 13న దక్షిణ కోస్తాంధ్రలోకి, ఆపై రెండు రోజులకు తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. నైరుతి ఆలస్యం అవుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో రేపటి నుంచి పాఠశాలలు తెరచుకోనుండగా, ఇంకా వడగాడ్పులు వీస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గతవారంలో ఉష్ణోగ్రతలు కొంత తగ్గినా, ఆ వెంటనే తిరిగి పెరగడంతో ఎండ ప్రభావాన్ని ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు.