Mumbai: ఉత్తరాదిలో భానుడి భగభగలు.. ముంబైలో దంచికొడుతున్న వర్షం.. 11 విమానాలు దారి మళ్లింపు

  • రన్‌వేపై గార్డ్ లైట్‌ను ఢీకొట్టి థాయ్ విమానం
  • ఢిల్లీకి మళ్లిన నెవార్క్ విమానం
  • జనజీవనం అస్తవ్యస్తం

భానుడి ప్రతాపంతో ఉత్తరాది చెమటలు కక్కుతుండగా ముంబైలో మాత్రం వరుణుడు దంచికొడుతున్నాడు. నైరుతి రుతుపవనాలు కేరళను తాకిన రెండు రోజుల్లోనే దేశ వాణిజ్య రాజధాని ముంబైలో భారీ వర్షాలు మొదలయ్యాయి. వెలుతురు మందగించడం, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో నగరంలోని చత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 11 విమానాలను దారి మళ్లించారు.

భారీ వర్షం కారణంగా ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన నెవార్క్ విమానాన్ని ఢిల్లీకి మళ్లించినట్టు విమానాశ్రయ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. థాయ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఒకటి ల్యాండింగ్ సమయంలో దారి కనిపించక గార్డ్ లైట్‌ను ఢీకొట్టింది.

అలాగే, భారీ వర్షం కారణంగా ముంబైలోని జనజీవనం అస్తవ్యస్తమైంది. సబర్బన్ రైళ్ల రాకపోకలపైనా ప్రభావం పడింది. కొలాబా, శాంతాక్రజ్, మలాడ్, కండివాలి, బొరివాలి, కుర్లా, ఘట్‌కోపర్, విక్రోలి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News