surgical strike: అవినీతిపై కేంద్రం సర్జికల్ స్ట్రయిక్స్.. 12 మంది ఆదాయపన్ను శాఖ అధికారులకు షాక్!
- అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై వేటు
- అందరినీ రాజీనామా చేయమన్న కేంద్రం
- అందరిపైనా తీవ్రమైన అవినీతి ఆరోపణలు, లైంగిక వేధింపుల కేసులు
అవినీతిపై కేంద్రం సర్జికల్ స్ట్రయిక్స్ ప్రారంభించింది. బీజేపీ తన నినాదం ‘నా ఖావూంగా.. నా ఖానేదూంగా’ను వాస్తవం చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా ఆదాయపు పన్ను శాఖకు చెందిన 12 మంది సీనియర్ అధికారులను రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించింది. వీరిలో చీఫ్ కమిషనర్, ప్రిన్సిపల్ కమినర్లు, కమిషనర్ కూడా ఉన్నారు. వీరిలో చాలామందిపై అవినీతి ఆరోపణలు, కేసులు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయి.
ఈ జాబితాలో జాయింట్ కమిషనర్ ర్యాంకు అధికారి అశోక్ అగర్వాల్ పేరు అగ్రస్థానంలో ఉంది. ఆయనపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. మరో ఇద్దరు అధికారులు హోమి రాజ్వంశ్, బీబీ రాజేంద్ర ప్రసాద్లపైనా ఇటువంటి ఆరోపణలే ఉన్నాయి. రాజ్వంశ్ అక్రమంగా రూ.3 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను సంపాదించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటుండగా, కేసులను తారుమారు చేసేందుకు పెద్ద ఎత్తున లంచాలు తీసుకుంటున్నట్టు రాజేంద్రప్రసాద్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిద్దరినీ ఉద్యోగానికి రాజీనామా చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.
అలాగే, నోయిడాలో కమిషనర్గా పనిచేస్తున్న ఐఆర్ఎస్ అధికారి ఎస్కే శ్రీవాస్తవపైనా కేంద్రం కొరడా ఝళిపించింది. కమిషనర్ ర్యాంకు అధికారులైన ఇద్దరు మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించినట్టు ఆయనపై ఆరోపణలున్నాయి. ఆయనను కూడా రిజైన్ చేయాల్సిందిగా ఆదేశించింది.