Andhra Pradesh: జస్ట్ మూడే మూడేళ్లు.. కడపలో ఉక్కు పరిశ్రమను ప్రారంభిస్తాం!: వైఎస్ అవినాశ్ రెడ్డి
- త్వరలోనే ఫ్యాక్టరీకి సీఎం జగన్ శంకుస్థాపన
- ప్రత్యేకహోదానే మా మొదటి అజెండా
- కడప జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన ఎంపీ
వైఎస్సార్ కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ త్వరలోనే శంకుస్థాపన చేస్తారని కడప లోక్ సభ సభ్యుడు వైఎస్ అవినాశ్ రెడ్డి తెలిపారు. మూడేళ్ల కాలంలో ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తిచేసి ఉత్పత్తిని ప్రారంభిస్తామని వెల్లడించారు. దీనివల్ల రాష్ట్రంలో 20,000 నుంచి 25 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.
ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో పార్లమెంటులో గట్టిగా గళం వినిపిస్తామని స్పష్టం చేశారు. కడప జిల్లాలో అభివృద్ధి పనులపై అవినాశ్ రెడ్డి ఈరోజు సమీక్ష నిర్వహించారు. జిల్లాకు సాగు, తాగునీరు అందించే గండికోట రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యాన్ని 12 నుంచి 26 టీఎంసీలకు పెంచుతామని అవినాశ్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన కడపను అభివృద్ధిలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు.