Andhra Pradesh: ప్రధాని మోదీ దృష్టికి పీపీఏ పంచాయితీ.. సీఎం జగన్ కు మద్దతు పలికిన ప్రధాని మోదీ!
- పీపీఏలను సమీక్షిస్తామన్న ఏపీ ముఖ్యమంత్రి
- అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి
- విషయాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను(పీపీఏ) సమీక్షిస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనివల్ల పెట్టుబడిదారుల్లో భయం నెలకొంటుందనీ, సమీక్షలు చేపట్టి పీపీఏలను రద్దుచేయడం మంచిది కాదని కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు లేఖ రాశారు. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం.
ఇటీవల ప్రధాని మోదీ తిరుమల పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. మోదీతో పాటు స్వామివారిని దర్శనం చేసుకున్న జగన్.. పీపీఏల వ్యవహారాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. దీంతో ‘తప్పు జరిగినప్పుడు సమీక్షించడంలో తప్పు ఏముంది?’ అని ప్రధాని అన్నట్టు పేర్కొన్నాయి. సౌర, పవన్ విద్యుత్ యూనిట్ ధర మార్కెట్ లో రూ.3-రూ.3.50 ఉండగా, గత ప్రభుత్వం రూ.6కు కొనుగోలు చేసిందని సీఎం జగన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విద్యుత్ ఒప్పందాలను సమీక్షిస్తామనీ, అవసరమైతే రద్దు చేస్తామని జగన్ ఇప్పటికే హెచ్చరించారు.