mulayam singh: అస్వస్థతకు గురైన ములాయం సింగ్ యాదవ్.. ఛార్టర్డ్ ఫ్లయిట్ లో గురుగ్రాంకు తరలింపు
- ఆదివారం లక్నోలోని ఆసుపత్రిలో చేరిన ములాయం
- ఎక్కువ స్థాయుల్లో బీపీ, షుగర్ లెవెల్స్
- నిన్న రాత్రి గురుగ్రామ్ కు తరలింపు
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను లక్నో నుంచి ఢిల్లీ శివార్లలో ఉన్న గురుగ్రామ్ కు ఛార్టర్డ్ ఫ్లయిట్ లో తరలించారు. అక్కడ ఉన్న మేదాంత ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అనారోగ్య కారణాలతో లక్నోలోని లోహియా ఆసుపత్రిలో ఆదివారం నాడు ఆయనను చేర్పించారు. బీపీ, షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని ఆయనను పరీక్షించిన వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం నిన్న ఉదయం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యాన్ని వైద్య బృందం రోజంతా పరీక్షిస్తూనే ఉంది. అయినా, సాయంత్రానికల్లా ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. దీంతో, నిన్న రాత్రి ఆయనను గురుగ్రామ్ కు తరలించారు.
మరోవైపు, నిన్న ములాయం నివాసానికి వెళ్లిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయనను పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కుంభమేళాకు సంబంధించి ఒక పుస్తకాన్ని ములాయంకు బహూకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, ములాయం సోదరుడు శివ్ పాల్ యాదవ్ అక్కడే ఉన్నారు.