Schools: స్కూలుకి వేళాయే.. నేటి నుంచి తెలంగాణలో పాఠశాలలు పునః ప్రారంభం!
- వేసవి ఎండల తీవ్రత కారణంగా ప్రతి ఏడాదీ సెలవులు పొడిగింపు
- వచ్చే ఏడాది నుంచి మళ్లీ పాత విధానమే
- విద్యా వార్షిక క్యాలెండర్ను విడుదల చేసిన తెలంగాణ విద్యాశాఖ
దాదాపు 45 రోజుల వేసవి సెలవుల తర్వాత నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గత కొన్ని సంవత్సరాలుగా జూన్ 1నే పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అయితే, వేసవి ఎండల తీవ్రత కారణంగా ప్రతి ఏడాది ఆ తర్వాత సెలవులను పొడిగిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా 11వ తేదీ వరకు పొడిగించారు. భవిష్యత్తులోనూ ఉష్ణోగ్రతలు ఇలానే ఉండే అవకాశం ఉందని భావించిన విద్యాశాఖ మళ్లీ పాత విధానానికే జై కొట్టింది. మునుపటి పద్ధతిలోనే యథావిధిగా జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం విద్యా వార్షిక క్యాలెండర్ను విడుదల చేసింది.
దాని ప్రకారం పాఠశాల మొత్తం పనిదినాలు 237 రోజులు కాగా, చివరి పనిదినం ఏప్రిల్ 23. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3.45 గంటల వరకు, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు, హైస్కూళ్లు ఉదయం 9.30 గంటల నుంచి 4.45 గంటల వరకు పనిచేస్తాయి.