Monsoon: తెలంగాణకు రుతుపవనాల రాక ఆలస్యమే.. అడ్డుకుంటున్న ‘వాయు’ తుపాను!
- అరేబియా సముద్రంలో ‘వాయు’ తుపాను
- రుతుపవనాల్లోని తేమను లాగేసుకుంటున్న తుపాను గాలులు
- నేడు, రేపు తెలంగాణలో మండిపోనున్న ఎండలు
వారం రోజులు ఆలస్యంగా కేరళను తాకిన రుతుపనాలు ముందుకు కదలకుండా అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘వాయు’ తుపాను బంధనాలు వేస్తోంది. దీంతో కేరళ నుంచి కదిలేందుకు రుతుపవనాలు మొరాయిస్తున్నాయి. 8వ తేదీనే అవి కేరళను తాకినప్పటికీ ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలోని ఉత్తరభాగానికి కూడా విస్తరించకపోవడంతో ప్రజలు కలవరపడుతున్నారు.
వాయు తుపానులోని గాలులు నైరుతి రుతుపవనాల్లోని తేమను లాగేసుకుంటున్నాయి. ఫలితంగా రుతుపవనాలు ముందుకు విస్తరించి వర్షాలు పడడం ఆగిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నిజానికి సాధారణ పరిస్థితుల్లో ఈ నెల 15 నాటికి తెలంగాణ, మహారాష్ట్రలను దాటి గుజరాత్ వరకు విస్తరించాలని అయితే, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని పేర్కొన్నారు. ఫలితంగా కేరళ నుంచి తెలంగాణకు రుతుపవనాల రాక మరో వారం ఆలస్యమయ్యేలా ఉందని వివరించారు. ఇక, నేడు రేపు తెలంగాణలో ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటాయని, ప్రజలు బయటకు రాకపోవడమే మంచిదని హెచ్చరించారు.