ICC: ఆ బెయిల్స్‌ను మార్చే ఉద్దేశం లేదు: తేల్చి చెప్పిన ఐసీసీ
- వివాదాస్పదమైన ఎల్ఈడీ బెయిల్స్
- బంతి వికెట్లను తాకినా కిందపడని బెయిల్స్
- ఫిర్యాదులు, విమర్శలపై స్పందించిన ఐసీసీ
ప్రపంచకప్‌లో వివాదాస్పదమైన ‘జింగ్’ బెయిల్స్‌ను మార్చే ఉద్దేశం లేదని ఐసీసీ స్పష్టం చేసింది. బంతి స్టంప్స్‌ను తాకినప్పటికీ బెయిల్స్ కిందపడకపోవడంతో చాలా వికెట్లను బౌలర్లు కోల్పోతున్నారంటూ ఇటీవల వీటిపై విమర్శలు వెల్లువెత్తాయి. వీటి స్థానంలో మామూలు బెయిల్స్‌ను ఉపయోగించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా స్కిప్పర్ అరోన్ ఫించ్‌లు ఈ ఎల్ఈడీ బెయిల్స్‌పై ఆదివారం ఫిర్యాదు కూడా చేశారు.
కెప్టెన్ల ఫిర్యాదు, మాజీ క్రికెటర్లు, అభిమానుల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలపై ఐసీసీ స్పందించింది. టోర్నీ మధ్యలో ‘జింగ్’ బెయిల్స్‌ను మార్చే ఉద్దేశం లేదని తేల్చి చెప్పింది. ఆట సమగ్రతను కాపాడాల్సిన అవసరం ఉందని, ప్రపంచకప్‌లో భాగంగా జరిగే 48 మ్యాచ్‌ల్లోనూ ఇవే బెయిల్స్ ఉంటాయని స్పష్టం చేసింది. అందరికీ ఒకే నిబంధన వర్తిస్తుందని పేర్కొంది.
ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు పదిసార్లు బంతి స్టంప్స్‌ను తాకినా బెయిల్స్ మాత్రం కిందపడలేదు. ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే జరిగింది. బుమ్రా వేసిన బంతి వికెట్లను తాకినప్పటికీ బెయిల్స్ మాత్రం కిందపడకపోవడంతో బ్యాట్స్‌మెన్ అవుట్ నుంచి తప్పించుకున్నాడు.