Uttar Pradesh: మరో యూపీ జర్నలిస్టుకు తీవ్ర అవమానం... నోట్లో మూత్రం పోసిన రైల్వే అధికారి!
- అనధికారిక వ్యాపారులపై కథనం కోసం వచ్చిన అమిత్ శర్మ
- అడ్డుకుని దారుణంగా కొట్టిన రైల్వే ఇన్స్పెక్టర్ రాకేశ్
- విధుల నుంచి తొలగించిన ఉన్నతాధికారులు
ఉత్తరప్రదేశ్ లో పాత్రికేయులపై ఆగడాలు ఆగడం లేదు. ఇప్పటికే పలువురు జర్నలిస్టులపై ప్రభుత్వం కేసులు పెట్టి జైలుకు పంపగా, తాజాగా, మరో దారుణ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో ప్రభుత్వ అధికారులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రైలులో జరుగుతున్న అనధికారిక వ్యాపారంపై ఓ కథనాన్ని చిత్రీకరించేందుకు వచ్చిన విలేకరిపై రైల్వే పోలీసు ఇనస్పెక్టర్ రాకేశ్ కుమార్ దారుణాతి దారుణంగా ప్రవర్తించాడు. అమిత్ శర్మ అనే విలేకరిపై రాకేశ్ దాడి చేసి తీవ్రంగా కొడుతున్న దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి.
వార్తను చిత్రీకరిస్తున్న తనను, దారుణాతి దారుణంగా కొట్టారని, కెమెరాను ధ్వంసం చేశారని, స్టేషన్ కు తీసుకెళ్లి, లాకప్ లో వేసి బట్టలూడదీసి, నోటిలో మూత్రం పోశారని ఆయన ఆరోపించారు. ఈ వీడియో వైరల్ కావడంతో స్పందించిన రైల్వే అధికారులు, ఘటనకు బాధ్యుడైన రాకేశ్ ను, మరో రైల్వే కానిస్టేబుల్ ను విధుల నుంచి తొలగిస్తూ, ఆదేశాలు జారీ చేశారు.