Andhra Pradesh: కొత్త ప్రభుత్వానికి 7 రోజుల గడువు ఇస్తాం.. ఆ తర్వాత దూకుడే!: టీడీపీ నేత పయ్యావుల కేశవ్
- అసెంబ్లీలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాం
- మా కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది
- మరికాసేపట్లో 15వ ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వ ప్రాధాన్య అంశాలకు తగ్గట్లు అసెంబ్లీలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తెలిపారు. ఏపీ అసెంబ్లీలో ఈ వారం వేచిచూసే ధోరణిని అవలంబిస్తామని చెప్పారు. ఆ తర్వాత రాజకీయంగా తాము ముందుకు పోతామని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ తమకు ముఖ్యమనీ, టీడీపీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ 15వ అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో పయ్యావుల మీడియాతో మాట్లాడారు. రాబోయే మూడు రోజులు ప్రమాణస్వీకారం, స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం ఉంటుందని వెల్లడించారు. ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళుతుంది? గత ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించి తమ కార్యాచరణను ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో తెలుసుకోవాలని తాము భావిస్తున్నామని తేల్చిచెప్పారు.