Hyderabad: చార్మినార్ కట్టడానికి శాశ్వత మరమ్మతులు: చెన్నై నుంచి కార్మికుల రాక
- పూర్వపు ఆకృతి చెడిపోకుండా పనులు
- ఇప్పటికే పరిశీలించిన పురావస్తు సర్వేక్షణ విభాగం
- ఈనెల 2న అర్ధరాత్రి ఓ మీనార్ నుంచి ఊడిన పెచ్చులు
హైదరాబాద్ మహానగరంలోని చారిత్రక కట్టడం చార్మినార్‌లో దెబ్బతిన్న భాగానికి శాశ్వత మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పూర్వపు ఆకృతి ఏ మాత్రం దెబ్బతినకుండా ఉండేలా అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే చెన్నై నుంచి నిపుణులైన కార్మికులను రప్పించారు. గత నెల 2వ తేదీ అర్ధరాత్రి ఈ కట్టడంలోని ఓ మీనార్ నుంచి పెచ్చులూడి పడిన విషయం తెలిసిందే. ఆ ప్రదేశంలోని బండరాయి పగుళ్లు పట్టింది. దాన్నుంచి ప్రమాదం తలెత్తకుండా ఉండేందుకు తాత్కాలికంగా జాలీని ఏర్పాటు చేశారు.
పురావస్తు సర్వేక్షణ విభాగం (ఏఎస్ఐ) అధికారులు ఇప్పటికే నాలుగైదు సార్లు కట్టడాన్ని సందర్శించి దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు. రెండు రోజుల క్రితం కూడా ఏఎస్ఐ హైదరాబాద్ సర్కిల్ అధికారి వచ్చి కట్టడాన్ని మరోసారి పరిశీలించారు. కూలిన డిజైన్ మట్టి పెళ్లలను కెమికల్ ల్యాబ్‌కు కూడా పంపించారు. అనంతరం పడిపోయిన ఆకృతిని అచ్చుపోసి ఏర్పాటు చేయాలని నిర్ణయించి చెన్నై కార్మికులకు ఆ బాధ్యత అప్పగించారు. పదేళ్ల క్రితం చార్మినార్‌కు మరమ్మతు చేసింది కూడా చెన్నై కార్మికులే. అనుభవం, నైపుణ్యం ఉన్న కార్మికులు కావడంతో వారికి బాధ్యత అప్పగించినట్లు, వారం రోజుల్లోపు పనులు చేపట్టనున్నట్లు చార్మినార్ అసిస్టెంట్ కన్సర్వేటరు డాక్టర్ గోపాలరావు తెలిపారు.