Hyderabad: మూడేళ్ల బుడతడి నరకయాతన... నాలుగు గంటలు కష్టపడి రక్షించిన పోలీసులు!
- హైదరాబాద్ లో ఘటన
- ఆడుకుంటూ వెళ్లి లిఫ్ట్ లో ఇరుక్కు పోయిన బాలుడు
- గోడను పగులగొట్టి బయటకు తెచ్చిన వైనం
హైదరాబాద్ శివారు చందానగర్, పాపిరెడ్డి కాలనీలో ఉన్న రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్స్ లో మూడేళ్ల బాలుడు లిఫ్ట్ లో చిక్కుకుని నరకయాతన అనుభవించగా, విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది నాలుగు గంటల పాటు శ్రమించి రక్షించారు. ఈ ఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది.
స్థానికులు వెల్లడించిన సమాచారం ప్రకారం, ఇక్కడి బ్లాక్ నెంబర్ ఈఏ2లో ఫణీంద్రా చారి కుమారుడు ఆర్యన్ నివాసం ఉంటుండగా, అతని కుమారుడు శౌర్యన్, ఆడుకుంటూ వెళ్లి లిఫ్ట్ ఎక్కాడు. సాంకేతిక కారణాలతో లిఫ్ట్ ఆగిపోగా, భయంతో అరవడం ప్రారంభించాడు. శౌర్యన్ అరుపులు విన్న చుట్టుపక్కలవారు, ఫణీంద్రాచారికి సమాచారం ఇవ్వగా, ఆయన పోలీసులను సంప్రదించాడు. హుటాహుటిన వచ్చిన పోలీసులు, లిఫ్ట్ ఎంతకూ కిందకు రాకపోవడంతో గోడలు బద్దలు కొట్టాలని నిర్ణయించి, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. దీంతో వారు వచ్చి, గోడను బద్దలుకొట్టి, చిన్నారిని బయటకు తీసుకువచ్చారు. దీంతో స్థానికులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.