India: మోదీజీ.. చైనాపై సర్జికల్ దాడులు చేయండి.. మన జవాన్లను కాపాడండి!: హార్దిక్ పటేల్
- అరుణాచల్ లో మాయమైన ఏఎన్-32 విమానం
- దీనివెనుక చైనా హస్తం ఉందన్న కాంగ్రెస్ నేత
- డ్రాగన్ దేశంపై సర్జికల్ దాడిచేయాలని డిమాండ్
భారత వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన ఏఎన్-32 విమానం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల అదృశ్యమయింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ నేత, హార్దిక్ పటేల్ ఇదంతా చైనానే చేసిందని ఆరోపించారు. భారత విమానాన్ని, అందులోని భారత జవాన్లను అప్పగించాల్సిందిగా చైనాను ప్రధాని మోదీ డిమాండ్ చేయాలని కోరారు.
‘మోదీజీ.. మీరు బాధపడొద్దు. మేమంతా మీ వెనుక ఉన్నాం. చైనా మీద సర్జికల్ దాడులు నిర్వహించండి. మన జవాన్లను విడిపించి వెనక్కు తీసుకురండి’ అని హార్దిక్ పటేల్ ట్వీట్ చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్ నేతగా ఉన్న హార్దిక్ పటేల్ కు అరుణాచల్ ప్రదేశ్ ఎక్కడుందో తెలియదా? అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు.