Telangana: ప్రణయ్ పరువు హత్య కేసు.. 1,600 పేజీల చార్జిషీట్ సమర్పించిన పోలీసులు!
- కిరాయి గూండాలతో ప్రణయ్ ను చంపించారని వెల్లడి
- 2018, సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్య
- హంతకుడికి రూ.కోటి సుపారీ ఇచ్చిన మారుతీరావు
నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో తన కుమార్తెను వివాహం చేసుకున్న ప్రణయ్ ను మామ మారుతీరావు కిరాతకంగా హత్య చేయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మారుతీరావుతో పాటు ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్, కరీమ్ లు ఇటీవల బెయిల్ పై విడుదల అయ్యారు. తాజాగా ప్రణయ్ కేసులో నల్గొండ పోలీసులు 1,600 పేజీల చార్జిషీట్ ను కోర్టులో దాఖలు చేశారు. మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్ కుమార్ కిరాయి గూండాల సాయంతో ప్రణయ్ ను చంపించారని పోలీసులు చార్జిషీట్ లో పేర్కొన్నారు. ఇందుకోసం మారుతీరావు రూ.కోటి సుపారీ ఇచ్చాడన్నారు.
2018, సెప్టెంబర్ 14న భార్య అమృతను మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రికి తీసుకొచ్చిన ప్రణయ్ పై ఓ కిరాయి గూండా వెనుక నుంచి కత్తితో దాడిచేశాడు. దీంతో ప్రణయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై తీవ్రమైన ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. తాజాగా ఈ ముగ్గురు నిందితులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.