Jagan: రోజాకు కలిసొచ్చిన 'విధేయత'!
- రోజా లేకుండానే జగన్ క్యాబినెట్
- ఎక్కడా అసంతృప్తి వెళ్లగక్కని రోజా
- వెతుక్కుంటూ వచ్చిన ఏపీఐఐసీ చైర్ పర్సన్ పదవి
రాజకీయాల్లో విధేయత అనే పదానికి ఎంతో విలువ ఉంటుంది. కొన్నిసార్లు విధేయతకు అర్థాలు మారిపోయినా, అంతిమంగా ఎవరైనా అధినాయకత్వానికి విధేయులుగా ఉండి సాధ్యమైనంత మేర లబ్ది పొందాలనుకోవడం సహజమే. నగరి ఎమ్మెల్యే రోజా విషయంలో విధేయత అంశం అద్భుతంగా పనిచేసింది.
కొన్నిరోజుల క్రితం సీఎం జగన్ తన క్యాబినెట్ ప్రకటించాక అందులో రోజా పేరులేకపోవడం అన్ని వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. రోజా లేకుండా జగన్ క్యాబినెట్టా? అంటూ విస్మయం చెందారు. ఆపై రోజా అలక, అందుబాటులో లేని రోజా, రోజా అసంతృప్తి అంటూ వార్తలు వినిపించాయి.
అయితే, తనకు మంత్రిపదవి దక్కకపోయినా రోజా ఎంతో విజ్ఞతతో వ్యవహరించింది. ఎక్కడా తన అభిప్రాయాలు వెల్లడించకుండా సంయమనం పాటించింది. అన్నిటికంటే ముఖ్యంగా, తనలో ఎక్కడా అసంతృప్తి లేదని చాటుతూ 'జగనన్న నిర్ణయమే నాకు శిరోధార్యం' అంటూ ఫేస్ బుక్ లో పిక్చర్ పోస్టు పెట్టింది. ఆ విధంగా జగన్ పట్ల తన విధేయత చాటుకుంది. ఇప్పుడా విధేయత ఫలితమే ఏపీఐఐసీ చైర్ పర్సన్ పదవి రోజాను వెతుక్కుంటూ వచ్చింది. మంత్రి పదవి దక్కకపోవడంతో ఏ చిన్న వ్యాఖ్య చేసి ఉన్నా రోజాను ఇంతటి ప్రాముఖ్యత ఉన్న పదవి వరించేది కాదనడంలో ఎలాంటి సందేహం లేదు.