North Korea: అధికారులు బతికుండగానే 'పిరానా' చేపలకు ఆహారంగా వేసిన కిమ్!
- ఉత్తర కొరియాలో దారుణం!
- కిమ్ ఆగ్రహానికి గురైన అధికారులు
- అత్యంత కిరాతకంగా హత్యకు గురైన వైనం
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కిరాతకాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటీవలే అమెరికాతో తమ చర్చలు విఫలం కావడానికి కారకులు వీళ్లేనంటూ ఐదుగురు అధికారులకు కిమ్ మరణశిక్ష విధించడం తెలిసిందే. అయితే, ఆ ఐదుగురిని ఎలా చంపారన్న విషయం 'ది స్టార్' అనే పత్రిక వెలుగులోకి తెచ్చింది. మనిషి మాంసాన్ని సైతం తినే పిరానా చేపలకు ఆ అధికారులను బలిచేశాడని ఆ పత్రిక పేర్కొంది.
కిమ్ అనుచరులు మొదట ఆ అధికారుల కాళ్లు, చేతులు నరికి ఆ మాంస ఖండాలను పిరానా చేపలకు ఎరగా వేశారు. రక్తం వాసన తగలగానే పెద్ద సంఖ్యలో పిరానా చేపలు రావడంతో ఆ అధికారులందరినీ బతికుండగానే నీళ్లలోకి తోసేశారు. దాంతో కొద్దిసమయంలోనే ఆ రాకాసి చేపలు ఆ అభాగ్యుల అంతుచూశాయి.
కాగా, తనకు నచ్చనివాళ్లను శిక్షించడానికి నిత్యం కొత్త పద్ధతులు ఎంచుకునే కిమ్ కొన్నాళ్లక్రితం బ్రెజిల్ నుంచి ప్రత్యేకంగా పిరానా చేపలను తెప్పించారు. వాటి కోసం కొన్ని చెరువులను ఏర్పాటుచేసి ఎంతో శ్రద్ధగా పెంచుతున్నారు. ఇన్నాళ్లకు కిమ్ కు వాటి అవసరం వచ్చింది. అయితే కిమ్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక 'ది స్పై హూ లవ్డ్ మీ' అనే జేమ్స్ బాండ్ చిత్రం స్ఫూర్తి అంటే ఆశ్చర్యం కలగకమానదు.
ఆ సినిమాలో ప్రతినాయకుడు తన ప్రత్యర్థులను సొరచేపలకు ఆహారంగా వేస్తుంటాడు. ఈ సన్నివేశం ఉత్తర కొరియా నియంత కిమ్ ను బాగా ఆకట్టుకుందట. అయితే, సొరచేపలకు బదులు వెరైటీగా పిరానా చేపలు తెప్పించి వాటితో మరణశిక్ష విధిస్తున్నాడని 'ది స్టార్' ఓ కథనంలో వివరించింది.