Darvesh Yadav: ఉత్తర ప్రదేశ్ బార్ కౌన్సిల్ అధ్యక్షురాలి హత్య.. ఆగ్రా సివిల్ కోర్టు ఆవరణలో హతమార్చిన సహ న్యాయవాది!
- 9న బార్ కౌన్సిల్ అధ్యక్షురాలిగా ఎన్నికైన దర్వేష్
- అరవింద్ మిశ్రా ఛాంబర్లో ఇద్దరి మధ్య వాగ్వాదం
- పిస్తోలుతో దర్వేష్‌ను కాల్చేసిన మనీశ్
ఉత్తరప్రదేశ్‌కి చెందిన బార్ కౌన్సిల్ తొలి మహిళా అధ్యక్షురాలు దర్వేష్ యాదవ్‌ని నేడు ఆమె సహ న్యాయవాదే దారుణంగా హతమార్చారు. అది కూడా ఆగ్రా సివిల్ కోర్టు ఆవరణ సమీపంలోనే జరగడం విస్మయానికి గురి చేస్తోంది. పోలీసుల కథనం ప్రకారం, ఈ నెల 9న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో బార్ కౌన్సిల్ అధ్యక్షురాలిగా దర్వేష్ యాదవ్ ఎన్నికై తొలి మహిళా అధ్యక్షురాలిగా రికార్డ్ సృష్టించారు.
తనను గెలిపించిన ఇతర న్యాయవాదులందరికీ ధన్యవాదాలు చెప్పేందుకు మనీశ్ శర్మ అనే సహ న్యాయవాదితో కలిసి దర్వేష్ వెళ్లారు. సీనియర్ న్యాయవాది అరవింద్ మిశ్రా ఛాంబర్లో వీరిద్దరికీ మధ్య వాగ్వాదం తలెత్తడంతో సహనం కోల్పోయిన మనీశ్ తన వద్దనున్న పిస్తోలుతో ఆమెను కాల్చేశాడు. ఆ తర్వాత మనీశ్ తనను తాను కాల్చుకున్నాడు. అతి సమీపం నుంచి తనపై కాల్పులు జరగడంతో దర్వేష్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వీరిద్దరినీ ఆసుపత్రికి తరలించగా దర్వేష్ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం మనీశ్ పరిస్థితి కూడా విషమంగానే ఉంది.