ICC World Cup: ప్రపంచకప్: వార్నర్ సెంచరీ.. ఆసీస్ చేతిలో పాక్ చిత్తు
- లక్ష్య ఛేదనలో చతికిల పడిన పాక్
- ప్రపంచకప్‌లో రెండో ఓటమి
- సెంచరీ వీరుడు వార్నర్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు
ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం టాంటన్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు అరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్‌లు దూకుడుగా ఆడారు. తొలి వికెట్‌కు 146 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫించ్ 84 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులు చేయగా, డేవిడ్ వార్నర్ సెంచరీ బాదాడు. 111 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌తో 107 పరుగులు చేశాడు. అయితే, జట్టులో ఈ ఇద్దరు మినహా మరెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఫించ్ తర్వాత షాన్ మార్స్ చేసిన 23 పరుగులే అత్యధికం. పాక్ బౌలర్ మహ్మద్ ఆమిర్ ధాటికి ఆసీస్ టాపార్డర్ పేకమేడలా కుప్పకూలింది. పది ఓవర్లు వేసి 30 పరుగులు మాత్రమే ఇచ్చిన ఆమిర్ 5 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం 308 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ 45.4 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ ఇమాముల్ హక్ 53 పరుగులతో ఆకట్టుకున్నప్పటికీ సరైన భాగస్వామ్యాలు లేకపోవడం జట్టును దెబ్బతీసింది. హక్ 53, బాబర్ ఆజం 30, మహ్మద్ హఫీజ్ 46, సర్ఫరాజ్ అహ్మద్ 40, హసన్ అలీ 32, వాహబ్ రియాజ్ 45 పరుగులు చేశారు. పాక్ ఆటగాళ్లలో ముగ్గురు డకౌట్ అయ్యారు. ఆసీస్ బౌలర్లు వరుసపెట్టి వికెట్లు తీసి పాక్‌ను ఒత్తిడిలోకి నెట్టేశారు. దీంతో పాక్ 266 పరుగులకే కుప్పకూలి 41 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్ 3 వికెట్లు తీసుకోగా, మిచెల్ స్టార్క్, రిచర్డ్సన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. కల్టర్ నైల్, అరోన్ ఫించ్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన డేవిడ్ వార్నర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
నాలుగు మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్‌కు ఇది రెండో ఓటమి కాగా, వర్షం కారణంగా ఓ మ్యాచ్ రద్దు అయింది. పాకిస్థాన్ మూడు పాయింట్లతో కింది నుంచి మూడో స్థానంలో ఉండగా, నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడు విజయాలు సాధించిన ఆసీస్ రెండో స్థానంలో ఉంది.