Jagan: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లకు కీలక పదవి!
- సామాజిక సమీకరణాల కారణంగా పదవులు దక్కని నేతలు
- పలువురికి కీలక నామినేటెడ్ పదవులు
- ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఆర్డీయే చైర్మన్ పదవి
- ఐదు ప్రాంతీయ మండళ్ల ఏర్పాటు
కచ్చితంగా మంత్రి పదవులు వస్తాయని భావించినా, వివిధ సమీకరణాల కారణంగా పదవులు వరించని పార్టీ ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్ కీలక పదవులను పంచుతున్నారు. ఇప్పటికే నగరి ఎమ్మెల్యే రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ పదవిని, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ పదవిని ఖరారు చేసిన జగన్, తాజాగా, మంగళగిరిలో మాజీ మంత్రి నారా లోకేశ్ ను ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఆర్డీయే (కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ) చైర్మన్ పదవిని అప్పగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
మంగళగిరిలో ఆళ్లను గెలిపిస్తే, మంత్రి పదవిని ఇస్తానని జగన్ ప్రజల ముందు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన జగన్ క్యాబినెట్ లో ఉంటారని భావించినా, అది కుదర్లేదు. దీంతో ఆళ్లకు సీఆర్డీయేను అప్పగించాలని జగన్ భావించినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. నేడో, రేపో దీనిపై అధికారుల ఉత్తర్వులు వెలువడనున్నాయి.
ఇదిలావుండగా, రాష్ట్రాభివృద్ధిని వేగం చేసేలా ఐదు ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేసి, పదవులు లభించని పార్టీ నేతలు ఐదుగురిని వాటికి చైర్మన్లుగా నియమించాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా-గుంటూరు, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, మిగతా సీమ జిల్లాలకు ఈ మండళ్లు ఉంటాయని సమాచారం. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే జిల్లాల పునర్వ్యవస్థీకరణను పూర్తి చేయాలని భావిస్తున్న సీఎం, సెప్టెంబర్ లోగా ప్రక్రియ కొలిక్కి తేవాలని భావిస్తున్నారు.