Indian woman: సౌదీ విమానాశ్రయంపై యెమన్ రెబల్స్ దాడి.. క్షతగాత్రుల్లో భారతీయ మహిళ
- విమానాశ్రయంపై క్షిపణి దాడి
- వివిధ దేశాలకు చెందిన 26 మందికి గాయాలు
- 2015 నుంచి సౌదీపై యెమన్ రెబల్స్ దాడులు
సౌదీ అరేబియా విమానాశ్రయంపై బుధవారం యెమన్ రెబల్స్ జరిపిన క్షిపణి దాడిలో 26 మంది పౌరులు గాయపడ్డారు. వీరిలో భారతీయ మహిళ ఒకరు ఉన్నారు. హౌతీ రెబల్స్ ప్రయోగించిన రెండు డ్రోన్లను అడ్డుకున్నామని రియాద్ ప్రకటించిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. యెమన్ రాజధాని సానా సహా చాలా ప్రాంతాలు ప్రస్తుతం రెబల్స్ చేతిలోనే ఉన్నాయి.
కాగా, సౌదీ విమానాశ్రయంపై ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్టు అరబ్ న్యూస్ పేర్కొంది. ఈ ఘటనలో వివిధ దేశాలకు చెందిన 26 మంది పౌరులు గాయపడినట్టు పేర్కొంది. వీరిలో ఓ భారతీయ మహిళ, ఇద్దరు సౌదీ చిన్నారులు ఉన్నట్టు వివరించింది. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
మిసైల్ దాడి తర్వాత విమానాశ్రయ సేవలు కొన్ని గంటలపాటు నిలిచిపోయాయి. కాగా, ఈ దాడి తమ పనేనని, దాడికి క్రూయిజ్ మిసైల్‌ను ఉపయోగించినట్టు యెమన్ రెబల్స్ ప్రకటించారు. హౌతీ రెబల్స్‌ను తరిమేసి అద్యక్షుడు అబెడ్రబ్బో మన్సౌర్ హదీ ప్రభుత్వాన్ని నెలకొల్పేందుకు సౌదీ ప్రభుత్వం 2015లో ప్రయత్నించింది. సౌదీ జోక్యాన్ని జీర్ణించుకోలేని రెబల్స్ అప్పటి నుంచి ఆ దేశంపై దాడులకు దిగుతూనే ఉన్నారు. ఈ దాడుల్లో ఇప్పటి వరకు వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో సామాన్య పౌరులే అత్యధికం.