Bhadradri Kothagudem District: భద్రాచలం ఏపీకా...అటువంటి ప్రతిపాదన ఏదీ లేదే!: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టీకరణ
- ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి
- ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ స్పష్టీకరణ
- ఉమ్మడి ప్రయోజనాల కోసం సీఎంలు కలిసి పనిచేస్తున్నారని వివరణ
కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించే అవకాశం ఉందన్న వార్తలను తెలంగాణ రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కొట్టిపారేశారు. అటువంటి ప్రతిపాదన ఏదీ తెలంగాణ ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా సరిహద్దులో ఉన్న ఈ చారిత్రక పుణ్యక్షేత్రం ఏపీకి అప్పగిస్తారన్న వార్తలు గత కొన్నాళ్లుగా సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతున్నాయి. పోలవరం పరిధిలోకి వచ్చే ఏడు మండలాలు ఏపీలో విలీనం కావడంతో భద్రాచలాన్ని కూడా విలీనం చేస్తారన్నది ఈ ఊహాగానాలకు కారణం.
పైగా, హైదరాబాద్‌లోని ఏపీ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడం, రెండు రాష్ట్రాల ప్రయోజనాలకోసం ఏపీ సీఎంతో కలిసి పనిచేస్తామని సీఎం కేసీఆర్ పదేపదే చెప్పడంతో ఈ ఊహాగానాలకు తెరలేచింది. అయితే ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించకున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇవన్నీ ఒట్టి ఊహాగానాలే అని కొట్టి పారేశారు. రాష్ట్రాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రులు కలిసి పనిచేస్తారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్‌ను ఆహ్వానించనున్నట్లు తెలిపారు.