Tourism minister: బాధ్యతలు స్వీకరించిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్
- 13 జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి
- ముందుకు వచ్చే సంస్థలకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతి
- ఆర్కియాలజీ కార్పొరేషన్ ఫైల్‌పై తొలి సంతకం చేసిన మంత్రి
ఆంధ్రప్రదేశ్‌లో టూరిజం అభివృద్ధికి తీసుకునే చర్యల్లో భాగంగా బ్రాండ్ అంబాసిడర్‌ను నియమించనున్నట్లు ఏపీ పర్యాటకాభివృద్ధి శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) ప్రకటించారు. అమరావతిలోని తన చాంబర్లో ఈరోజు బాధ్యతలు స్వీకరించిన ఆయన అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జల్లాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇందుకోసం భాగస్వాములుగా చేరే ప్రైవేటు సంస్థలకు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.
రాష్ట్రానికి వచ్చే ప్రతి టూరిస్టును దేవునితో సమానంగా గౌరవిస్తామని, వారికి పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని తెలిపారు. రేవ్ పార్టీలు, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపనున్నట్లు తెలిపారు. కాగా, మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ముత్తంశెట్టి టూరిజం కార్పొరేషన్ తరహాలోనే ఏర్పాటు చేస్తున్న ఆర్కియాజీ కార్పొరేషన్ ఫైల్‌పై తొలి సంతకం చేశారు.