Tamilnadu: ఆర్థిక బాధలు భరించలేక అన్నంలో విషం కలుపుకుని కుటుంబం ఆత్మహత్య!
- తమిళనాడులోని నాగపట్నంలో ఘటన
- అప్పుల ఊబిలో చిక్కుకున్నసెంథిల్ కుమార్
- భార్యతో అసభ్యంగా ప్రవర్తించిన అప్పులవాళ్లు
ఆత్మ గౌరవంతో బతకాలన్న ఆశ ఓవైపు, అప్పులవాళ్ల వేధింపులు మరోవైపు ఓ కుటుంబాన్ని కుంగదీశాయి. చివరికి కుమారుడి స్కూలు ఫీజు కట్టేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో అతని తల్లిదండ్రులు మనస్తాపానికి లోనయ్యారు. ముగ్గురూ విషం తీసుకుని ప్రాణాలు విడిచారు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
తమిళనాడులోని నాగపట్నం జిల్లా వేలియపాలెంలో సెంథిల్ కుమార్ స్వర్ణకారుడిగా పనిచేస్తున్నాడు. అయితే వ్యాపారం, కుటుంబ నిర్వహణ కోసం సెంథిల్ గతంలో కొన్ని అప్పులు చేశాడు. అయితే వాటిని గడువులోగా చెల్లించలేకపోయాడు. ఈ క్రమంలో ఇటీవల పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. ఆరో తరగతి చదువుతున్న సెంథిల్ కుమార్ కొడుకు(11) ఫీజు చెల్లించకపోవడంతో యాజమాన్యం అతడిని ఇంటికి పంపేసింది.
ఫీజు కట్టకుంటే టీసీ ఇచ్చేస్తామని పాఠశాల యాజమాన్యం హెచ్చరించింది. దీనికితోడు అప్పులు ఇచ్చినవాళ్లు ఇంటికి వచ్చి సెంథిల్ కుమార్ భార్యతో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఈ జంట అన్నంలో విషం కలిపి కుమారుడికి తినిపించి తామూ తిన్నారు. దీంతో ముగ్గురూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
ఈ నేపథ్యంలో పిల్లాడి స్నేహితులు సెంథిల్ ఇంటికి రాగా, తలుపులు వేసి ఉన్నాయి. ఎంతగా తలుపులు తట్టినా తీయలేదు. దీంతో వారంతా ఇరుగుపొరుగువారికి సమాచారం అందించారు. దీంతో వారంతా తలుపులు పగులగొట్టగా, ముగ్గురూ అపస్మారక స్థితిలో కనిపించారు. వీరిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వారు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.