Andhra Pradesh: ఇదేముంది, టీ కప్పులో తుపాన్ లాంటిది: ఏపీ స్పీకర్ తమ్మినేని
- అసెంబ్లీలో తమ్మినేనిని అభినందించే కార్యక్రమం
- సభ్యుల పరస్పర ఆరోపణలపై స్పందన
- ప్రవర్తనా నియమావళి ప్రకారమే సభ్యులు నడుచుకోవాలి
ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఈ రోజు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. తమ్మినేనిని స్పీకర్ చైర్ వద్దకు తీసుకెళ్లే సమయంలో టీడీపీ శాసనసభా పక్ష నేత చంద్రబాబు వెళ్లకపోవడంపై సభలో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మాటల యుద్ధం జరిగింది. అసెంబ్లీ సమావేశం రేపటికి వాయిదా వేసిన అనంతరం, ఈ విషయమై స్పీకర్ తమ్మినేని స్పందించారు.
‘మిమ్మల్ని అభినందించే కార్యక్రమం సభ్యుల పరస్పర ఆరోపణలకు వేదికైంది!’ అన్న దానికి తమ్మినేని బదులిస్తూ, ‘ఏం కాదు. ఏముంటుంది. మామూలుగానే ఉంటుంది. ‘ఇదేముంది, టీ కప్పులో తుపాన్’ లాంటిదని అన్నారు.
‘సభపై, సభ్యులపై అజామాయిషీ చలాయిస్తారా? అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ‘అజమాయిషీ చలాయించడానికి మనమేన్నా చక్రవర్తులమా? రాజులు, రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి. చక్రవర్తుల యుగం అంతరించిపోయింది. ప్రజాస్వామ్య యుగం. కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సభ్యుల ప్రవర్తనా నియమావళి ఉంది. దాని ప్రకారమే వారు నడుచుకోవాలి. అందుకే, వారికి శిక్షణా తరగతులు పెడతాం. శిక్షణా తరగతులు అయిన తర్వాత సభ్యులకు ఒక లైన్ ఆఫ్ మైండ్ సెట్ వస్తుంది’ అని చెప్పారు.