Amit Shah: ఈ ఏడాది చివరివరకు అమిత్ షానే బీజేపీ చీఫ్!
- త్వరలో మూడు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు
- అమిత్ షా వ్యూహ చతురతపై బీజేపీ హైకమాండ్ నమ్మకం
- నడ్డా తదుపరి చీఫ్ అంటూ ప్రచారం
ఈ ఐదేళ్లలో బీజేపీ చీఫ్ గా కాషాయ దళాన్ని సమర్థవంతంగా నడిపించిన అమిత్ షా ఈ ఏడాది చివరివరకు అవే బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఆ తర్వాత 2019 డిసెంబరులో కానీ, 2020 ఆరంభంలో కానీ బీజేపీ కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకునే అవకాశాలున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా నియమితుడైన సంగతి తెలిసిందే. దాంతో, ఆయన బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగుతారని ప్రచారం జరిగింది. అమిత్ షా వారసుడిగా జేపీ నడ్డా కొత్త రథసారథిగా వస్తాడని బలంగా వినిపించింది.
కానీ, బీజేపీ వ్యూహకర్తల ఆలోచనలు మరోలా ఉన్నాయి. ఈ ఏడాది హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. 2014, 2019 ఎన్నికల్లో అమిత్ షా వ్యూహ చతురత బీజేపీని అఖండ మెజారిటీతో గెలిపించిందనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో, మూడు రాష్ట్రాల ఎన్నికలయ్యేవరకు బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షానే కొనసాగించాలని మోదీ సహా అగ్రనేతలందరూ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.