Andhra Pradesh: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పనిచేశాం.. అయినా ప్రజలు ఎందుకు ఓడించారో అర్థం కావట్లేదు!: టీడీపీ అధినేత చంద్రబాబు
- గెలిచినప్పుడు ఆనందం.. ఓడినప్పుడు ఆవేదన సహజం
- కార్యకర్తలపై దాడులు జరగకుండా నేతలు చూడాలి
- విజయవాడలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు
విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో ఈరోజు తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమయింది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యేలు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, ముఖ్యనేతలు, పార్టీ శ్రేణులు హాజరయ్యాయి. ఈ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి సీట్లు తగ్గినా, ఓట్ల శాతం పెరిగిందని చంద్రబాబు తెలిపారు. ‘37 ఏళ్ల టీడీపీ చరిత్రలో ఐదుసార్లు గెలిచాం.. నాలుగుసార్లు ఓడాం. గెలిచినప్పుడు ఆనందం ఉంటుంది, అలాగే ఓడిపోయినప్పుడు ఆవేదన ఉండటం సహజం’ అని వ్యాఖ్యానించారు.
ఏపీ విభజన అనంతరం తీవ్రమైన ఆర్థికలోటు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపామనీ, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో, అలాగే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలపై దృష్టి సారించాలని నేతలకు చంద్రబాబు సూచించారు. అలాగే పార్టీకోసం అహోరాత్రులు కష్టపడిన కార్యకర్తలకు టీడీపీ నేతలు అండగా నిలవాలనీ.. పార్టీ శ్రేణులపై దాడులు జరిగితే వెంటనే ప్రతిస్పందించాలని ఆదేశించారు. ఏపీలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు వెళ్లామనీ, ప్రజలపై ఆర్థికలోటు భారం పడనివ్వలేదని చెప్పారు. అయినా ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదని చెప్పారు. ఈ విషయంలో నేతలంతా సమీక్షించుకోవాలన్నారు.