Andhra Pradesh: గవర్నర్ ప్రసంగం ప్రారంభమూ, ముగింపూ ‘నవరత్నాలు’తోనే! : టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఎద్దేవా
- గవర్నర్ స్పీచ్ అసంపూర్తిగా ఉన్న పాలసీ డాక్యుమెంట్
- అభివృద్ధి అనే అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు
- అన్ని కోణాలను స్పృశించి ఉంటే బాగుండేది
ఏపీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ఈరోజు ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ ప్రసంగంపై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, అసంపూర్తిగా ఉన్న పాలసీ డాక్యుమెంట్ లా గవర్నర్ ప్రసంగం ఉందని విమర్శించారు. కొత్త ప్రభుత్వం ఈ ఏడాది పాటు ఏం చేయాలనుకుంటున్నారనే దానిపై పాలసీ గైడ్ లైన్స్ డాక్యుమెంట్ ఇవ్వాల్సింది పోయి, అభివృద్ధి అనే అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి, కేవలం సంక్షేమానికి మాత్రమే పరిమితమైందని అన్నారు.
గవర్నర్ ప్రసంగం ‘నవరత్నాలు’ ప్రస్తావనతోనే మొదలవడం, ముగియడం జరిగిందని ఎద్దేవా చేశారు. అభివృద్ధిలో భాగంగా రూరల్, అర్బన్ ప్రాంతాలకు కల్పించే సదుపాయాల గురించి, ఏపీలో ప్రాజెక్టుల నిర్మాణం ఆపేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో వాటిని కొనసాగిస్తారా? లేదా? రాజధాని అమరావతి నిర్మాణం ముందుకు వెళ్తుందా? లేదా? అన్న దానితో పాటు, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి ప్రస్తావించలేదని అన్నారు.
గవర్నర్ ప్రసంగం అన్ని కోణాలను స్పృశించి ఉంటే బాగుండేదని, ఈ ప్రభుత్వం ఫలానావి చేయాలనుకుంటోందన్న ముఖచిత్రం తెలిసేదని అన్నారు. వైసీపీతో టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల గురించి పయ్యావులను ప్రస్తావించగా, ఆయనకు ఎవరైతే టచ్ లో ఉన్నారో, వారి పేర్లను బయటపెడితే ఆసక్తికరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.