New Delhi: ఢిల్లీ మెట్రో రైళ్లలో మహిళలకు ఉచితం ప్రయాణం ప్రతిపాదనను ఒప్పుకోవద్దు: ప్రధానికి లేఖ రాసిన మెట్రో రూపకర్త శ్రీధరన్
- ఢిల్లీ మెట్రోలో మహిళలకు ఉచితంపై కేజ్రీ సర్కారు ప్రతిపాదన
- ప్రభుత్వ వనరులను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోరాదన్న శ్రీధరన్
- ప్రధాని జోక్యం చేసుకోవాలంటూ సూచన
ఢిల్లీ మెట్రో రైళ్లలో మహిళలకు ఉచితం ప్రయాణం అంటూ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం పేర్కొనడంపై మెట్రో రైల్ వ్యవస్థ రూపకర్త శ్రీధరన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మెట్రో రైళ్లలో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఢిల్లీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు సమ్మతించవద్దంటూ ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. మహిళలకు సాయం చేయాలని కేజ్రీవాల్ సర్కారుకు అంత కోరికగా ఉంటే, ఉచిత ప్రయాణం చేయించే బదులు నేరుగా టికెట్ రుసుమును చెల్లించవచ్చు కదా అంటూ శ్రీధరన్ ప్రశ్నించారు.
ఢిల్లీ మెట్రో రైల్ వ్యవస్థ ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో నడిచే సంస్థ అని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, ఓ భాగస్వామి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం కుదరదని తన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ వనరులను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం తగదని శ్రీధరన్ హితవు పలికారు. అంతేకాకుండా, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి సూచించారు. శ్రీధరన్ గతంలో ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ కు చీఫ్ గా వ్యవహరించారు. దేశంలో మెట్రో వ్యవస్థకు ఆయన్ను ఆద్యుడిగా భావిస్తారు. మెట్రోమ్యాన్ అనేది ఆయనకు బిరుదుగా మారిపోయింది.