Andhra Pradesh: ఏపీలో సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షకు కమిటీ ఏర్పాటు
- కమిటీ కన్వీనర్ గా జలవనరుల శాఖ చీఫ్ టెక్నికల్ ఎగ్జామినర్
- ఈ కమిటీలో ఎనిమిది మంది సభ్యులు
- 25 శాతం కంటే తక్కువ పూర్తయిన ప్రాజెక్టులపై సమీక్ష
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే ప్రక్రియలో భాగంగా ఏపీ సర్కార్ ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఏపీలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి సమీక్షించేందుకు మరో కమిటీని ఏర్పాటు చేసింది. సాగునీటి ప్రాజెక్టులు, సీఆర్డీఏ, రోడ్లు, భవనాల శాఖలో ప్రాజెక్టులపై సమీక్షకు కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జలవనరుల శాఖ చీఫ్ టెక్నికల్ ఎగ్జామినర్ కన్వీనర్ గా ఎనిమిది మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటు జరిగింది.
టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాని ప్రాజెక్టులు, 25 శాతం కంటే తక్కువ పూర్తయిన ప్రాజెక్టులపై కమిటీ సమీక్ష చేయనుంది. అవసరమైతే రీటెండరింగ్ ను సూచించాలని, నలభై ఐదు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కమిటీలో ఇరిగేషన్, విద్యుత్, ఆర్ అండ్ బీ, ప్రాజెక్టు డిజైన్స్ రంగాలకు చెందిన రిటైర్డ్ ఇంజనీర్లు సభ్యులుగా ఉన్నట్టు సమాచారం.