Andhra Pradesh: తల్లిదండ్రులంతా పిల్లలను స్కూలుకు పంపండి.. ఏటా రూ.15 వేలు అందుకోండి!: ఏపీ మంత్రి కొడాలి నాని
- ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తోంది
- ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
- గుడివాడలో ‘రాజన్న బడిబాట’లో పాల్గొన్న నాని
తల్లిదండ్రులంతా తమ పిల్లలను పాఠశాలలకు పంపాలని ఏపీ పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని సూచించారు. ఒకటో తరగతి నుంచి పదో క్లాస్ వరకూ తమ పిల్లలను బడికి పంపించే తల్లిదండ్రులకు ‘అమ్మ ఒడి’ పథకం కింద ఏటా రూ.15,000 అందజేస్తామని తెలిపారు. తల్లిదండ్రులు అంతా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కృష్ణా జిల్లా గుడివాడలోని ఏజీకే పాఠశాలలో ఈరోజు నిర్వహించిన రాజన్న బడిబాట కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాలామంది విద్యార్థులతో మంత్రి అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం చిన్నారులకు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.