naresh goel: రూ. 650 కోట్ల పన్ను ఎగవేత కేసులో నరేష్ గోయల్ కు నోటీసులు
- నరేశ్ గోయల్ కు షాక్ ఇచ్చిన ఐటీ శాఖ
- జనరల్ సేల్స్ ఏజెంట్ కు భారీ మొత్తంలో కమిషన్లు ముట్టచెప్పినట్టు నిర్ధారణ
- ఐటీ చట్టం పరిమితులకు మించి చెల్లింపులు జరిపినట్టు గుర్తింపు
జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రూ. 650 కోట్ల పన్ను ఎగవేత కేసులో ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఆయనకు ఐటీ శాఖ సమన్లు జారీ చేయడం ఇదే తొలిసారి. ముంబైలోని జెట్ ఎయిర్ వేస్ కార్యాలయంలో గత ఏడాది ఐటీ అధికారులు సోదాలు జరిపారు. పలు డాక్యుమెంట్లను అప్పట్లో స్వాధీనం చేసుకున్నారు. దుబాయిలోని ఒక ఎయిలైన్స్ కంపెనీతో జెట్ ఎయిర్ వేస్ కు అక్రమ లావాదేవీలు జరిగాయని దర్యాప్తులో తేలింది. దుబాయ్ లోని ఒక జనరల్ సేల్స్ ఏజెంట్ కు ప్రతి ఏటా భారీ మొత్తంలో కమిషన్లను ముట్టచెప్పినట్టు అధికారులు నిర్ధారించారు. ఆదాయపు పన్ను చట్టం కింద ఉన్న పరిమితులకు మించి ఈ చెల్లింపులు జరిగినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో గోయల్ కు నోటీసులు జారీ అయ్యాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో జెట్ ఎయిర్ వేస్ మూతపడిన సంగతి తెలిసిందే.