Old Traford: మాంచెస్టర్ కు వరుణ ముప్పు... అభిమానుల్లో ఆందోళన!
- నేడు ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో మ్యాచ్
- రాత్రి వర్షంతో మైదానంలో నీరు
- నేడు కూడా వాన ముంచెత్తే చాన్స్
ఈ వరల్డ్ కప్ సీజన్ లోనే అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్ అసలు జరుగుతుందా? క్రికెట్ అభిమానులను వేధిస్తున్న ప్రశ్న ఇది. ఇంగ్లండ్ లో వాతావరణ సంస్థలు అన్నీ ఆదివారం నాడు మాంచెస్టర్ లో వర్షం కురుస్తుందనే చెబుతున్నారు. దీంతో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ నేడు జరగాల్సిన మ్యాచ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. న్యూజిలాండ్ తోనూ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిందన్న సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ జరగకపోయినా, ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, నేడు పాక్ తో మాత్రం ఆట జరగాలని కోరుకుంటున్నారు.
ఇక మ్యాచ్ జరిగే సమయంలో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా మధ్యాహ్నం తరువాత వర్షం పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. కాగా, భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 10 గంటల సమయంలోనూ మాంచెస్టర్ లో వర్షం పడింది. పిచ్ ను కవర్లతో కప్పి ఉంచారు. మైదానంలో వేరువేరు చోట్ల నీళ్లు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో మైదానాన్ని ఎలా సిద్ధం చేస్తారన్న సందేహాలు తలెత్తుతున్నాయి. కాగా, మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో మొత్తం ఆరు మ్యాచ్ లు జరగనున్నాయి. నేడు భారత్, పాక్ మధ్య జరుగుతున్నదే తొలి మ్యాచ్.