Australia: దంచిన ఫించ్.. శ్రీలంకపై ఆసీస్ ఘన విజయం

  • 87 పరుగుల భారీ తేడాతో ఓడిన శ్రీలంక
  • పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఆసీస్
  • మరో మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్‌పై సౌతాఫ్రికా విజయం

ప్రపంచకప్‌లో భాగంగా లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 87 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 335 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక 247 పరుగులకే ఆలౌటైంది.

ఒక దశలో శ్రీలంక ఓపెనర్లు దిముత్ కరుణరత్నె, కుశాల్ పెరీరాలు ఆస్ట్రేలియాను భయపెట్టారు. బ్యాట్‌తో చెలరేగిపోయారు. తొలి వికెట్‌కు 115 పరుగులు జోడించడంతో శ్రీలంక విజయం వైపుగా నడుస్తున్నట్టు కనిపించింది. 36 బంతులు ఎదుర్కొన్న పెరీరా 5 ఫోర్లు, సిక్సర్‌తో 52 పరుగులు చేశాడు. అయితే, పెరీరా అవుటైన తర్వాత మ్యాచ్ మారిపోయింది. పరుగులు రావడం కష్టమైంది.

మరోవైపు కెప్టెన్ దిముత్ కరుణరత్నె సెంచరీకి మూడు పరుగుల మందు అవుటై అభిమానులను ఉసూరుమనిపించాడు. 108 బంతులు ఎదుర్కొన్న కరుణరత్నె9 ఫోర్ల సాయంతో 97 పరుగులు చేశాడు. ఇక, అతడు అవుటైన తర్వాత వికెట్లు టపటపా పడిపోయాయి.  కుశాల్ మెండిస్ (30) ఒక్కడే కాసేపు ప్రతిఘటించాడు. ఒక దశలో 186/3తో ఆస్ట్రేలియాను వణికించిన శ్రీలంక 45.5 ఓవర్లలో 247 పరుగులకే ఆలౌట్ ఘోర పరాజయం పాలైంది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 వికెట్లు తీసుకోగా, కేన్ రిచర్డ్‌సన్ 3, పాట్ కమిన్స్ 2, బెహ్రెండార్ఫ్ ఓ వికెట్ తీసుకున్నాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్, స్టీవెన్ స్మిత్‌ల వీర విహారంతో 334 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన ఫించ్ 132 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్సర్లతో 153 పరుగులు చేయగా, 59 బంతులు ఎదుర్కొన్న స్మిత్ 7 ఫోర్లు, సిక్సర్‌తో 73 పరుగులు చేశాడు. మాక్స్‌వెల్ 46 పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లలో ఇసురు ఉడానా, ధనంజయ డి సిల్వా చెరో రెండు వికెట్లు తీసుకోగా, మలింగకు ఓ వికెట్ దక్కింది. 153 పరుగులతో అదరగొట్టిన ఫించ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా 8 పాయింట్లతో అగ్రస్థానానికి చేరింది.

కార్డిఫ్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. వర్షం కారణంగా కుదించిన ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ తొలుత 34.1 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం డక్‌వర్త్ లూయిస్ విధానంలో దక్షిణాఫ్రికా విజయ లక్ష్యాన్ని సవరించగా 28.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 131 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 4 వికెట్లు పడగొట్టిన సౌతాఫ్రికా బౌలర్ ఇమ్రాన్ తాహిర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఐదు మ్యాచ్‌లు ఆడిన సఫారీలకు ఇది తొలి విజయం కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News