Andhra Pradesh: ఏపీ సర్కారు తాజా నిర్ణయం... మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు గన్ మెన్ల తొలగింపు!

  • శనివారం పొద్దుపోయిన తరువాత ఉత్తర్వులు
  • అంతకుముందే నోటి మాటతో ఆదేశాల అమలు
  • దరఖాస్తు చేస్తే పరిశీలించి భద్రత కొనసాగిస్తాం
  • స్పష్టం చేస్తున్న ఉన్నతాధికారులు

ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు గన్ మెన్ లను తగ్గించాలని జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గత రాత్రి పొద్దుపోయిన తరువాత ఉత్తర్వులు వెలువడ్డాయి. గతంలో మంత్రులకు ఫిష్ట్ కు ఇద్దరేసి చొప్పున నలుగురు గన్ మెన్ల రక్షణ ఉండేది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కూడా ఇదే పద్ధతి కొనసాగింది. ఆపై నిన్న ఉదయం నుంచి పలు జిల్లాల్లో గన్ మెన్లను రిపోర్ట్ చేయాలని జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. రాతపూర్వక నిర్ణయం లేకుండా, నోటి మాట ద్వారా సెక్యూరిటీ ఉపసంహరణ ఉత్తర్వులు శుక్రవారమే వెలువడ్డాయని తెలుస్తోంది.

ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో మాజీ మంత్రులు పితాని, జవహర్ లకు ఉన్న భద్రతను పూర్తిగా తొలగించినట్టు తెలుస్తోంది. గతంలో ఎక్సైజ్ శాఖలో పని చేసిన తాను, కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నందున ప్రాణహాని ఉందని, భద్రత కొనసాగించాలని జవహర్ కోరినట్టు సమాచారం. ఆయన వినతిని పోలీసు అధికారులు పట్టించుకోలేదు.

ఇదిలావుండగా, కొందరు ఓట్ల లెక్కింపు పూర్తికాగానే తమ గన్ మెన్ లను ఉపసంహరించుకున్నారు. ప్రభుత్వ భద్రత తమకు అక్కర్లేదని మాగంటి బాబు, బడేటి బుజ్జిలు రెండు వారాల క్రితమే గన్ మెన్ లను తిప్పి పంపారు. ఎవరైనా తమకు భద్రత అవసరమని భావిస్తే, దరఖాస్తు చేసుకోవాలని, పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News