Kerala: అమానవీయం... తనను కాదన్నదని మహిళా పోలీసును సజీవదహనం చేసిన అధికారి!
- కేరళలోని మావెలిక్కర పరిధిలో ఘటన
- బైక్ ను ఢీకొట్టి, ఆపై గొడ్డలితో దాడి
- పెట్రోల్ పోసి నిప్పంటించిన పోలీసు అధికారి
తనను కాదన్నదన్న ఆగ్రహంతో విచక్షణ కోల్పోయాడో పోలీసు అధికారి. తోటి మహిళా అధికారి వెళుతుంటే, ఆమె వాహనాన్ని ఢీకొట్టి, ఆపై పెట్రోలు పోసి సజీవదహనం చేశాడు. ఇంతటి అమానవీయ ఘటన కేరళలో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, సౌమ్య పుష్కరన్ (31) అనే యువతి, మావేలిక్కర మున్సిపాలిటీ పరిధిలోని వాలిక్కున్న పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నారు. శనివారం సాయంత్రం ఆమె తన విధులను ముగించుకొని టూ వీలర్ పై ఇంటికి వెళుతుండగా, ఆలువా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో అధికారిగా పని చేస్తున్న అజాస్, తన కారుతో వచ్చి ఆమె బండిని ఢీ కొట్టాడు. ఆమె పరిగెత్తేందుకు ప్రయత్నించగా, వెంబడించి, తొలుత గొడ్డలితో దాడి చేశాడు. ఆపై వెంట తెచ్చిన పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
ఒళ్లంతా నిప్పు అంటుకున్న పరిస్థితిలో సౌమ్య బాధతో ఆర్తనాదాలు చేసింది. ఆమెను చూసిన స్థానికులు మంటలను అదుపు చేయగా, అప్పటికే మరణించింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అజాస్ ను అరెస్ట్ చేసి, కేసును విచారిస్తున్నారు. గతంలో వారిద్దరి మధ్యా ప్రేమ వ్యవహారం ఉందని, ప్రస్తుతం అజాస్ ను ఆమె దూరం పెట్టిందని, ఆ కోపంతోనే ఆమెపై దాడి చేశాడని పోలీసులు అంటున్నారు.