India: నా వల్ల కాదు... టీవీల్లో చూడండి: విరాట్ కోహ్లీ
- నేడు పాకిస్థాన్ తో మ్యాచ్
- కోహ్లీని పాస్ లడిగిన మిత్రులు
- ఇవ్వలేనని తేల్చి చెప్పిన కోహ్లీ
నేడు మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్ట్ వేదికగా, చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ జట్లు ఐసీసీ ప్రపంచకప్ లో భాగంగా తలపడనుండగా, ఇప్పటికే అమ్మకానికి ఉంచిన టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. ఈ మ్యాచ్ పై వాతావరణం ప్రభావం చూపుతుందని, మ్యాచ్ జరిగే అవకాశాలను వరుణుడు దెబ్బతీయనున్నాడని నిపుణులు అంటున్నా, మ్యాచ్ ని స్వయంగా చూడాలని భావిస్తున్న వారి సంఖ్య మరింతగా పెరుగుతూనే ఉంది. మ్యాచ్ కి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ ని ప్రత్యక్షంగా తిలకించేందుకు తన స్నేహితులు ఎంతో మంది పాసులు ఆడుగుతున్నారని చెప్పాడు.
టికెట్లు, పాసులు ఇవ్వడం మొదలుపెడితే, అది ఆపేందుకు కుదరదని అన్నాడు. ఇటువంటి టోర్నమెంట్ లకు వచ్చినప్పుడు ముందే చెప్పి రావాలని సూచించాడు. తన ఫ్రెండ్స్ మ్యాచ్ చూసేందుకు రావాలా? అని అడిగారని, వారికి తాను ఒక్కటే చెప్పదలచుకున్నానని, రావాలనుంటే రావచ్చని, టికెట్లు లేకుండా మాత్రం రావద్దని అన్నాడు. టికెట్లను తాను ఇవ్వలేనని తేల్చి చెప్పాడు. అందరి ఇళ్లలో మంచి టీవీలు ఉన్నాయని, టీవీలో మ్యాచ్ చూడాలని సలహా ఇచ్చాడు.