Pakistan: భారత్-పాక్ మ్యాచ్ ఫైనల్‌కు ముందు ఫైనల్ లాంటిది: అంచనాలను మరింత పెంచిన ఇంజీ వ్యాఖ్యలు
- మరికొన్ని గంటల్లో ప్రపంచకప్‌లో బిగ్ ఫైట్
- గత రికార్డులను తాను పట్టించుకోబోనన్న హక్
- కోహ్లీ సేనపై ప్రశంసలు
ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చేశాయి. ఈ ప్రపంచకప్‌లోనే ‘బిగ్ ఫైట్’ గా చెప్పుకునే భారత్-పాక్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. వరుణుడు కనుక ఈ ఒక్కరోజు ఆగితే అభిమానులకు పసందైన విందు భోజనం లభించినట్టే. మాంచెస్టర్‌లో మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్న ఈ మ్యాచ్‌కు అభిమానులు అప్పుడే సిద్ధమైపోతున్నారు.
ఈ మ్యాచ్‌ను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని, క్రికెట్‌ను క్రికెట్‌లానే చూసి ఎంజాయ్ చేయాలంటూ టీమిండియా సారథి కోహ్లీ భారత్-పాక్ అభిమానులకు విన్నవించినా దాయాదుల పోరుపై అభిమానుల్లో ఉండే అంచనాలే వేరు.
ఇక, ఈ హైటెన్షన్ మ్యాచ్‌పై పాక్ మాజీ క్రికెటర్, ఆ జట్టు చీఫ్ సెలక్టర్ ఇంజిమాముల్ హక్ చేసిన వ్యాఖ్యలు మ్యాచ్‌పై అభిమానులకున్న అంచనాలను మరింత పెంచేశాయి. ఇది అలాంటి ఇలాంటి మ్యాచ్ కాదని, ఫైనల్‌కు ముందు ఫైనల్ మ్యాచ్ లాంటిదని పేర్కొన్నాడు. ప్రపంచకప్‌లో భారత్-పాక్‌లు ఎప్పుడు తలపడినా అది ఫైనల్‌కు ముందు జరిగే ఫైనల్‌లానే ఉంటుందని ఇంజిమామ్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారని చెప్పాడు. స్టేడియం సామర్థ్యం 24 వేలు కాగా, 8 లక్షల మంది టికెట్ల కోసం ఎగబడ్డారని పేర్కొన్నాడు. దీనిని బట్టే ఈ మ్యాచ్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చని ఇంజిమామ్ పేర్కొన్నాడు.
ప్రపంచకప్ మ్యాచుల్లో భారత్ చేతిలో పాక్ ఇప్పటి వరకు ఆరుసార్లు ఓటమి పాలైంది. భారత్‌కున్న ఈ రికార్డును హక్ ప్రస్తావిస్తూ.. గత రికార్డులను తాను పట్టించుకోబోనని, మ్యాచ్ రోజు ప్రదర్శనే ఫలితాన్ని నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చాడు. భారత్ చేతిలో ప్రతిసారి ఓడిపోతున్న పాక్‌పైనే ఈసారి కూడా ఒత్తిడి ఉంటుందని ఇంజీ పేర్కొన్నాడు. అయితే, మ్యాచ్‌ను మ్యాచ్‌లానే చూడాలని అభిమానులను కోరుతున్నట్టు చెప్పాడు. కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు సమతూకంతో ఉన్నట్టు హక్ పేర్కొన్నాడు.