Andhra Pradesh: వైసీపీ రౌడీలు తెలుగుదేశం శ్రేణులపై దాడులు చేస్తున్నారు.. ఇదేనా మీరు చెప్పిన రాజన్న రాజ్యం?: నారా లోకేశ్
- ఎన్నికల్లో గెలుపు బాధ్యతను పెంచాలి
- దాడులతో మా సహనాన్ని పరీక్షించవద్దు
- పోలీస్ యంత్రాంగం ఇప్పటికైనా స్పందించాలి
ఎన్నికల్లో గెలుపు అన్నది బాధ్యతను పెంచాలి తప్ప అరాచకాలకు మార్గం కాకూడదని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై వైసీపీ రౌడీలు దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు, దౌర్జన్యాలతో టీడీపీ పార్టీ కేడర్ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. గుంటూరు జిల్లాలో పిన్నెల్లి గ్రామంలో టీడీపీకి ఓటేశారని రైతులను ఐదు సంవత్సరాలు గ్రామ బహిష్కరణ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
నెల్లూరు జిల్లాలోని వెంకటేశ్వరపురం, గాంధీ గిరిజన కాలనీలో ప్రజలు టీడీపీకి ఓటేసినందుకు పేదల గుడిసెలు కూల్చడానికి ప్రయత్నించారని మండిపడ్డారు. ఇలా ఏపీ అంతటా 100 దాడి ఘటనలు చోటుచేసుకున్నాయని చెప్పారు. ‘ఇదేనా మీరు చెప్పిన రాజన్న రాజ్యం?’ అని లోకేశ్ నిలదీశారు. ఇప్పటికయినా పోలీస్ యంత్రాంగం స్పందించి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నారా లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు.