Andhra Pradesh: సీఎం జగన్ అందరిని కలుపుకుని పోవాలి.. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి!: సీపీఐ రామకృష్ణ
- నీతిఆయోగ్ లో జగన్ ప్రసంగం అభినందనీయం
- ఆయన హోదా, విభజన హామీలపై మాట్లాడారు
- విభజన హామీలను ప్రధాని మోదీ అమలు చేయాలి
ఢిల్లీలో నిన్న జరిగిన నీతిఆయోగ్ సదస్సులో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడంపై ముఖ్యమంత్రి జగన్ మాట్లాడటం అభినందనీయమని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. ప్రత్యేక హోదా, ఏపీ విభజన హామీలు అమలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై జగన్ మాట్లాడారని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం జగన్ చర్యను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఏపీ విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలుకు ప్రధాని మోదీ చిత్తశుద్ధితో పనిచేయాలని రామకృష్ణ కోరారు. పార్లమెంటు సాక్షిగా చేసిన చట్టాలను అమలుచేయాలనీ, ప్రజల్లో చట్టసభల పట్ల విశ్వాసం పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ సీఎం జగన్ అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.